Home రూప వాణీయం ఓటెంతకు అమ్మేద్దాం??!!

ఓటెంతకు అమ్మేద్దాం??!!

0

బంపర్ సేల్ బొనాంజా స్టార్ట్ ..

ఎన్నికల నగారా కుయ్య్ మంటూ కూత కూసింది. ఐదేళ్ళుగా ప్రజాక్షేత్రం చిరునామానే మర్చిపోయి..కుంభకర్ణుడి నిద్రపోయి…కొద్దినెలలుగా మాత్రం వామ్ అప్స్ ఫీట్లు చేసేందుకు గోచీలు.. కొంగులు బిగించి ప్రజాక్షేత్రంలో దుమికారు నాయకులనబడే పగటివేషగాళ్ళు. ఒక్కో కులానికీ..వర్గానికీ..మతానికీ ఒక్కోరేటు..ఓటుకు రేటు కట్టే షరాబులు వీరైతే…ఓటరు తన హక్కును ఐదేళ్ల పాటు అమ్ముకునే గులాము. ఎవడి ఓటు పాట వాడిది..ఓటమి మాత్రం ప్రజాస్వామ్యానిదే.


అసలూ..అధికార…ప్రతిపక్ష..విపక్ష వర్గాలలో కూతవేటుదూరంలో నాయకుడనేవాడు కనిపిస్తే ఒట్టు. నాయకత్వలక్షణాలకి ఎప్పుడో చరమగీతం పాడేసి…స్వీయ ఎదుగుదల కోసం నిరంతరం శ్రమించిన శ్రమజీవులు వీళ్ళు. సామాన్యుల హక్కులను సరసమైన ధరలకు సేల్ కి పెట్టే సేల్స్ మాన్స్..


తాము అడుగడుగునా చేస్తున్న ప్రజాద్రోహానికి అందమైన పరదాలు సంక్షేమపథకాలుగా అలంకరించి పబ్బంగడుపుకుంటున్న ఆత్మద్రోహులు అడుగడుగునా రాజకీయరంగు ఏదో ఒకపార్టీది కండువాలకు పులిమేసుకుని..నిస్సిగ్గుగా రంగులు మార్చే ఊసరవెల్లులు నేటి రాజకీయనాయకులు.

వ్యవస్థలన్నీ నిబద్దత..అంకితభావం.. సామాజికబాధ్యత.. నైతికతను పాతాళానికి తొక్కేసి…రాజకీయతొత్తులుగా… వెన్నెముక చచ్చుబడిన పరాన్నజీవులుగా మారడం ప్రజల ఖర్మ. ఏ వ్యస్థ చూసినా గౌరవాన్నీ..నమ్మకాన్నీ కోల్పోవడం రాజ్యాంగవిలువలను కాలరాయడమనే స్పృహ ఏ ఒక్కరిలో లేకపోవడం భవిష్యత్తు కు ప్రమాదసూచిక.

నైతికత లక్ష్మణరేఖను దాటని విభాగముందా..


సమాజనిర్మాణంలో అతికీలకమైన న్యాయవ్యవస్థ కలుషితం అయిందనే ఆరోపణలు వెల్లువెత్తడం విషాదం. వృత్తినిబద్దతలో భాగంగా సమాజంలో ఏవిభాగానికి సంబంధించిన వారితో కూడా పరిచయాలు.. సమావేశాలు ఉండకూడదనేది నిబంధన. కానీ దురదృష్టవశాత్తు న్యాయానికి ప్రతినిధులు విరివిగా విందులు.. వ్యక్తిగతసమావేశాలలో కనిపించడం వ్యవస్థ డొల్లతనానికి సూచిక.


లా అండ్ ఆర్డర్ గతితప్పి అవినీతి..అధికారమదపు అస్తవ్యస్త అడుగులతో రక్షణవ్యవస్థ మీద నమ్మకాన్నే సమూలంగా పెరికేసింది. ఇక సమాజంలో అవతవకలను ఏం గాడిలో పెట్టగలుగుతుంది. ప్రజలపక్షాన నిలబడి వారికి ధైర్యాన్ని, విశ్వాసాన్నీ కలిగించాల్సిన రక్షణాధికారులు… ప్రజలకు దూరమై.. అధికారరాజకీయపక్షాల ఇంటి గేటుకి చౌకీదార్లుగా రూపాంతరం చెందడం వ్యవస్థల పతనానికి పరాకాష్ఠ.
పరిపాలనా వ్యవస్థ గురించి ఇక చెప్పాల్సిన పనేలేదు. ప్రభుత్వం అందించిన సంక్షేమఫలాలను సామాన్యుడి నోటికీ అంది..వారి జీవితం పరిపుష్ఠం అయ్యేలా దోహదపడాల్సిన అంచెలంచెల వ్యవస్థ స్వార్థపూరిత చర్యలతో తనకీ..తనవారికీ కడుపునిండిన తరువాత మిగిలిన సంక్షేమాన్ని పరిగెలా విదిలిస్తోంది. దీనిని మించిన ద్రోహం ఉంటుందా సామాన్యుడి విషయంలో..లోపాలను సవరించాల్సిన పరిపాలపా వ్యవస్థే ఇంత లోపభూయిష్టంగా మారిపోతే ఇక పరిష్కారమెక్కడా..కనుచూపుమేరలో కనిపిస్తుందా..?? నిజంగా భ్రమే…అంతగా పతనం అయ్యాయి వ్యవస్థలు.


వీరందరి మీద కన్నేసి ఉంచి ప్రజల పక్షాన ఉండాల్సిన జర్నలిజం విలువలకు ఎప్పుడో తిలోదకాలు ఇచ్చేసి..ఒక్కో పెట్టుబడిదారీ దళారికి దాసోహం అనేసింది. ఈ విభాగంలో మురికి ఎన్ని గంగలొచ్చినా ప్రక్షాళన కాదు. ఆ మురుగు గురించి మాట్లాడుకోవడం అంటే మన విలువను మనం తగ్గించుకోవడమే. విషాదం ఏవిటంటే ఈ మురుగువీచికల నడుమ ప్రతీ సాయంత్రం..ఉదయం జ్ఞానకిరణాలను ప్రసరించే బూతుచర్చలు అనర్ఘళంగా ఘంటారావం మోగిస్తుంటాయ్. ఇక్కడ నీతులు..ఆదర్శాలు దేవతావస్త్రాలు ధరించి విన్యాసాలు చేస్తుంటే వెగటుతో ప్రజాస్వామ్యం కుంచించుకుపోతుంది. చెంచాగిరీ చాకచక్యం తెలిసినోడే జర్నలిస్టంట..ఇక సమాజమేం బాగుపడుతుంది. పగటికల కాకపోతే..


అందుకే అమ్మినోడికి అమ్మినంత..అమ్ముకున్నోడికి అమ్ముకున్నంత. ఎన్నికల బంపర్ సేల్ బొనాంజా స్టార్ట్ ఇన్ తెలంగాణ. లాభాలన్నీ నాయకులవే…బలిచక్రవర్తి మాత్రం సామాన్యుడే..
యాయ్ సేల్ అండీ సేల్..

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version