ఇంత సింప్లిసిటీ ఏంటి రాజు గారు!
మా సిటీ లో కార్పొరేటర్ కూడా ఆ సిమెంట్ దిమ్మ మీద అసలు కూర్చోరు! అవసరమైతే కారులో కూర్చుని అసిస్టెంట్ లపై ఆధారపడి ట్రైన్ వచ్చాక గన్ మెన్ దారి చూపిస్తే “రాజు వెడలే” అన్నట్లు ట్రైన్ ఎక్కేవారు! మీకు తెలుసా? అసలు ట్రైన్ జర్నీ యే చేయరు! ఫ్లైట్ లో ఎక్కేందుకు, గంటలు గంటలు లావిష్ గా ఎయిర్ పోర్ట్ లో వెయిట్ చేసేందుకే ఇష్టపడతారు! అది కదా స్టేటస్! మీరేంటి సార్ ఇంత సింపుల్ గా! మనవడు, భార్య తో కలసి అలా ట్రైన్ కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అంత సింపుల్ గా సిమెంట్ దిమ్మ పై కూర్చున్నారు! కనీసం బెంచ్ కూడా వెతుక్కోలేదు!
గుర్తులేదు కానీ, ఆరు సార్లు ఎమ్మెల్యే గా, రాష్ట్రం లో మంత్రిగా కీలక శాఖ బాధ్యతలు, ఎంపి గా, పైగా అప్పట్లో టీడీపీ బీజేపీ అలియన్స్ లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కూడా పని చేసిన గొప్ప నాయకులు మీరు! మీ పార్టీలో మీరు అగ్రనేత! పొలిట్ బ్యూరో సీనియర్ సభ్యులు! మీరంటే పార్టీల రహితంగా అందరికి గౌరవం! మరీ ఇంత గాంధీతత్వం ఈరోజుల్లో పనికిరాదు! ఇంత సింప్లిసిటీ నా? మెచ్చుకోలేక పోతున్నాం! అస్సలు భరించలేకపోతున్నాం!
ఎంత దర్జాగా ఉండాలి!
పూసపాటి అశోక్ గజపతి రాజు గారు అంతే! ఎవరి మాట వినరు! పాత కాలపు పోకడలు వున్న పెద్ద మనిషి! పెద్ద జమీందారు! మహారాజ వంశీయుడు! లక్షల ఎకరాలు మంచినీళ్ళల దానం చేసిన గొప్ప వంశం! ఎంత దర్జాగా ఉండాలి!ఎంత పొగరు చూపించాలి! ఆ మాట కొస్తే కళ్ళు నెత్తిన ఉండాలి! మీరేంటి సారు ఇంత సింపుల్గా సీతయ్యలా ఉన్నారు!
మీకు పడవ లాంటి బెంజ్ కార్లు ఉండాలి! ఆ కార్లలో తిరగాలి! సొంత చాప్టర్ విమానం, సొంత హెలికాప్టర్ ఉండాలి! ఇదేందయ్యా రైల్లో ప్రయాణం చేయడం! నేన్యాడ సూళ్ళేదయ్య సామి! ఇప్పటికీ బుద్దిగా సీట్ బెల్ట్ వేసుకుని నానో అనే ఆటో లా కనిపించే బుజ్జి కారులోనే సొంత గా డ్రైవ్ చేసుకుంటూ తిరుగుతారట! విజయనగరం లో కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు మీ గురించి! డ్రైవర్ ను కూడా పెట్టుకోని సింప్లిసిటీ గురించి! పైగా మీ కారు మీరే కడుక్కోవడం, తుడుచుకోవడం ఇంకా మరీ విచిత్రం!
మీరేం నాయకులు స్వామి!
రూల్స్ కు విరుద్ధంగా పైరవీలు చేయడం మీకు రాదు! మీరెలా ఇన్ని దశాబ్దాలుగా రాజకీయ రంగంలో కొనసాగుతున్నారు! స్థానిక పోలీస్ స్టేషన్ కు లేదా ఎమ్మార్వో కార్యాలయానికి ఒక్కసారి అయినా ఫేవర్ గా ఫోన్ చేయలేదట! చేయనే చేయరట! నిజాయితీ సమస్య అయితేనే మీనుంచి ఫోన్ వస్తుందని, అడ్డదిడ్డ వ్యవహారాలకో, ఎవరికో వత్తాసు పలుకుతోనో, మన పార్టీ వాడు చూసి చూడనట్లు పొమ్మనో మీరు మీ చరిత్రలో ఇంతవరకు ఏ ఒక్క అధికారికి చెప్పలేదట! ఇది న్యాయమేనా? మీ దగ్గర పని చేసే అధికారులు కానివ్వండి, మీ నియోజకవర్గ అధికారులను బెదిరించి అడ్డదిడ్డమైన పనులు చేయించుకోవాలి కదా! మీరేం నాయకులు స్వామి! ఇంత మంచిగా ఉంటే ఎట్టా?
మీ అమ్మాయికి స్కూల్లో సీటు కోసం అప్పట్లో మీ దగ్గర పని చేసే పిఎ రికమండ్ చేసి ఇప్పించాడు సరే! మీదేం పోయింది? మీ అమ్మాయికేగా సీటు వచ్చింది! అయినా రూల్స్ కు విరుద్ద్ధం అని ఆ పీఎ ను వెంటనే మార్చేశారట గా! మీరు మంత్రిగా వున్నప్పుడు మీ అమ్మాయికి ర్యాంక్ ప్రకారం మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీ లో సీటు వస్తే చేర్పించారు సరే, ఆ అమ్మాయి పాపం రెండు ఆర్టీసీ బస్సులు మారి రోజూ ఆరు గంటలు ప్రయాణం చేస్తూ ఇబ్బంది పడుతున్నదని తెలుసుకుని సిటీ గాంధీ కాలేజీ కి మార్పించిన అధికారిని వెంటనే బదిలీ చేసేశారట! ఇదేం శాడిజం సారు! మీ పాపకేగా హెల్ప్ చేసింది?
ఇలాగయితే ఎట్టా?
అసలు రాజకీయ నేత, అందునా కాకలు తీరిన నేత ఎలా ఉండాలి? కబ్జాలు చేయాలి! జెండాలు పాతాలి! అడ్డంగా అక్రమంగా అన్ని పనులు చేయించుకోవాలి! మీరేంటి సారు! ఉన్నవన్ని దానాలు చేసేస్తుంటారు! ప్రభుత్వ అధికారులు కొర్రీలు పెట్టి ఆపేస్తే బాధితులకు సొంత డబ్బులు ఇచ్చి పంపిస్తుంటారట! ఇలాగయితే ఎట్టా? ఇంత మంచితనం ఉంచుకుని ఈ పాడు లోకంలో ఎట్టా నెట్టుకొస్తున్నారు! మిమ్మల్ని ఆదర్శం గా తీసుకోమని మేము ఎవ్వరికీ చెప్పలేము! చెప్పినా ఎటు నుంచి నవ్వుతారో తెలియదు! అసలే మంచి రోజులు కావు! అయినా మీకు, మీ మంచితనానికి, మీ నిలువెత్తు స్వచ్ఛతకు, నిఖార్సయిన మీ రాజకీయానికి చేతులెత్తి దండం పెడుతున్న! ఈసారి కనిపించినప్పుడు పాదాభివందనం కూడా చేస్తా! ఎందుకంటే కోటికి ఒక్కరు కూడా ఉండరు… మీ లాంటి వారు!
- డా. మహ్మద్ రఫీ