23 C
Vijayawada
Wednesday, November 27, 2024

చరిత్రనే మార్చేస్తారా..??

Must read

అడిగే వారు లేరనేగా ఇంత దుర్మార్గం!

సీనియర్ పాత్రికేయులు డా. మహమ్మద్ రఫీ సూటిప్రశ్న..

టైగర్ నాగేశ్వర రావు సినిమాలో అన్నీ అభూతకల్పనలే అంటూ ఆవేదన..మానిన పుండు పై మళ్ళీ కారం చల్లిన టైగర్ నాగేశ్వరరావు సినిమా..90 శాతం కల్పితం తీసి బయోపిక్ టైటిల్ పెట్టడం దారుణం!

రాత్రి రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా చూశాను! టైగర్ గురించి తెలియని వారికి ఇదొక గొప్ప సినిమా అనిపించవచ్చు! తెలిసిన వారికి మాత్రం ఆద్యంతం చిరాకు తెప్పించే సినిమా! టైగర్ నాగేశ్వరరావు టైటిల్ పెట్టిన ఆ దర్శకుడు కనిపిస్తే చెంప ఛేళ్లుమనిపించేలనే కోపం వచ్చింది! ఇంత దుర్మార్గమా? ఇంత కల్పితమా? 95 శాతం కల్పిత సన్నివేశాలు చుట్టేసి బయోపిక్ అని దర్జాగా టైగర్ నాగేశ్వరరావు టైటిల్ పెట్టేశారు! డబ్బులు దండుకుంటున్నారు! ఇంత దారుణమా? అడిగే వాళ్ళు లేరనేగా? ఎవరూ పట్టించుకోరనేగా? ఏదొక టైటిల్ పెట్టి తీసినా ఈ సినిమా బాగానే ఆడి ఉండేది! రవితేజ అద్భుతంగా ఆ పాత్రలో ఒదిగిపోయి కష్టపడ్డాడు! కానీ, టైగర్ నాగేశ్వరరావు లా కాదు! మానిన స్టువర్ట్ పురం గాయం పై మళ్ళీ గెలికి కారం చల్లినట్లు ఉంది! ఆ ఊరి వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా కష్టాలు అనుభవించి గత రెండున్నర దశాబ్దాలుగా ఒక మంచి మార్గం లో నడుస్తున్న ప్రయత్నానికి మళ్ళీ గండి కొట్టే ప్రయత్నం చేసి క్షమించరాని తప్పు చేశాడు దర్శకుడు వంశీ!

మా అమ్మ వృత్తి రీత్యా టీచర్ కావడం తో పదేళ్ల పాటు వేటపాలెం లో వున్నాం! అప్పుడే నాకు టైగర్ నాగేశ్వరరావు గురించి తెలిసింది! ఇంటర్ అయ్యాక సమ్మర్ హాలిడేస్ లో అక్కడ జడ్ వి టైపు ఇన్స్టిట్యూట్ లో ఇంస్ట్రక్టర్ గా పార్ట్ టైం జాబ్ చేస్తుండే వాడ్ని! అప్పుడు స్టవర్ట్ పురం నుంచి అబ్బాయిలు అమ్మాయిలు వచ్చి మా ఇన్స్టిట్యూట్ లో చేరేవాళ్లు! చీరాల లో అన్ని టైపు ఇన్స్టిట్యూట్స్ పెట్టుకుని చీరాల, జాండ్రపేట్ దాటుకుని వేటపాలెం వస్తున్నారు అని ఆశ్చర్యం కలిగింది! అదే విషయం వాళ్లతో అంటే… చేర్చుకోరు సార్ అన్నారు! అందుకే ఇంత దూరం వస్తున్నాం! చాలామంది బాపట్ల, గుంటూరు వెళతారు అని చెప్పారు! ఎందుకు అంటే ఆది దొంగల పురం గా ముద్ర! అప్పటికే టైగర్ నాగేశ్వరరావు ఎన్ కౌంటర్ అయి ఏడేళ్ళు అయ్యింది! ఊరులో మార్పు వచ్చింది! ఏదొక పని చేసి బతుకుతున్నా అదే ముద్ర తో చూస్తున్నారు అంటూ వాళ్ళు చెప్పిన మాటలు విన్నాక నాలో టైగర్ నాగేశ్వరరావు పట్ల ఆసక్తి పెరిగింది! తెలుసుకునే ప్రయత్నం లో భాగంగా చాలా మందిని కలిశాను!

సినిమా ల్లో చూపించినట్లుగా టైగర్ నాగేశ్వరరావు ఎప్పుడూ అంత పెద్ద దారుణాలు ఏం చేయలేదు! నాగేశ్వరరావు అన్న ప్రభాకర్ మాటల్లో అయితే 1974లో చేసిన బనగానపల్లె బ్యాంక్ దొంగ తనమే వాళ్ళు చేసిన అతి పెద్దది! ఆ దొంగతనం లో 14 కిలోల బంగారం, 30 వేల రూపాయల నగదు మాత్రమే దొంగిలించారు! ఆ బ్యాంక్ సరిగ్గా పోలీస్ స్టేషన్ ముందే ఉంటుంది! అది టైగర్ నాగేశ్వరరావు కలేజా! ఆకలి కోసం అన్నం కోసం బతుకు కోసం దారి తెలియని వయసులోనే నాగేశ్వరరావు వంశ వృత్తి దొంగగా మారాడు! అప్పటికే తల్లిదండ్రులు చనిపోయారు! అన్నలు ప్రసాద్, ప్రభాకర్ దగ్గరే పెరిగాడు! అన్నల బాట లోనే అడుగు పెట్టాడు! అయితే అప్పటి వరకు వాళ్ళు చేసిన దొంగతనాలు వేరు! నాగేశ్వరరావు చేతులు కలిపాక ప్యాషన్ గా మార్చేసుకున్నారు! సాహసం ఆయన ఊపిరి! ఛాలెంజ్ విసిరి దొంగతనం చేసి తప్పించుకోవడం లో మహా నేర్పరి!

అసలు టైగర్ నాగేశ్వరరావు గురించి ఇప్పటికీ ఆ పరిసర ప్రాంతాల్లో కథలు కథలు చెబుతుంటారు! గాడిద రక్తం తాగి సముద్రపు ఒడ్డున ఇసుకలో గుర్రం లా పరుగెత్తే వాడు అని, స్ప్రింగ్ బూట్లు వేసుకుని మూడంతస్థుల బిల్డింగ్ పై నుంచి ఏ ఆధారం లేకుండా కిందకు దూకే వాడు అని, ఒకసారి వేటపాలెం లో ఒక బిల్డింగ్ పై నుంచి నేరుగా దూకి బావి అంచున సేఫ్ గా ల్యాండ్ అయ్యాడని, ఒళ్ళంతా నూనె పూసుకుని దొంగతనానికి వస్తాడని ఇలా చెప్పేవారు! ఇది నిజమో కాదో తెలియదు కానీ, ఆయన వాడేది ఒక మెలిక తిరిగిన ఐరన్ రాడ్ మాత్రమే! ఏ ఇంటికి అయినా వెనక ఉండే కిటికీ సువ్వ వంచి ఒకరు లోపలకు వెళ్లి తలుపు గడియ తీస్తే మిగిలిన వాళ్ళు ఇంట్లోకి ప్రవేశిస్తారు! ఒక్క బనగానపల్లె బ్యాంక్ దొంగతనం లో మాత్రమే తొమ్మిది మంది నాగేశ్వరరావు వెంట ఉన్నారు! మిగిలిన దొంగతనాలు అన్నీ ఆయనతో మరో ముగ్గురు మాత్రమే!

నిజానికి 1874 లో సెటిల్మెంట్ చట్టం కింద దొంగల కుటుంబాలతో స్టవర్ట్ పురం ఏర్పడింది! మద్రాస్ ప్రెసిడెన్సీ హోం అధికారి హెరాల్డ్ స్టువర్ట్ దొంగల్లో పరివర్తన కోసం ఏర్పాటు చేశారు ఆయన పేరిట! కానీ, పోలీసులు మామూలోళ్ళు కాదుగా! ఏ దొంగతనం ఎక్కడ జరిగినా ఎవరు చేసినా స్టువర్ట్ పురం వాళ్లే చేసారంటూ వీళ్లనే అరెస్ట్ చేసి జైలు శిక్షలు వేయిస్తూ అసలు వాళ్ళ తో లాలూచి పడుతుండే వాళ్ళు చీరాల పోలీసులు! కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల్లో జరిగిన దొంగతనాలకు కూడా వీరిని బాధ్యులు చేసి అరెస్ట్ చేస్తుండేవాళ్ళు! అక్కడ నుంచి వచ్చిన పోలీసులకు వీళ్ళను అప్పగించే వారు! అది తట్టుకోలేక పోయాడు నాగేశ్వరరావు! అందుకే ఆంధ్రప్రదేశ్ తో పాటు ఆ మూడు రాష్ట్రాల్లోను దొంగతనాలు మొదలుపెట్టాడు! ఒకసారి తిరువల్లూరు లో పట్టుబడితే జైలులో వేశారు! ఆ జైలర్ అరుళ్ కు చెప్పి మరీ సెంట్రీ కళ్ళల్లో కారం కొట్టి తప్పించుకున్నాడు! వరస దొంగతనాలు చేస్తూ రెండు నెలల తరువాత పట్టుబడటం తో అరుళ్ మెచ్చుకుని, “సామాన్యుడివి కాదురా నువ్వు నిజంగా టైగర్” అని భుజం తట్టాడట! అలా టైగర్ నాగేశ్వరరావు గా మారిపోయాడు!

దొంగతనానికి వెళ్ళినప్పుడు మహిళలను అసభ్యంగా చూడకూడదు, ఇబ్బంది పెట్టకూడదు, వారి తాళి బొట్లు తీసుకోకూడదు అనే నిబంధన పెట్టుకుని ఆచరించాడు! సీనియర్ నేత పిడతల వెంకట సుబ్బయ్య కుటుంబం అప్పట్లో రెండు కార్లలో తిరుపతి వెళుతున్నారని తెలుసుకుని రేణిగుంట దగ్గర లారీ అడ్డు పెట్టి అటకాయించారట! ఒక దుప్పటి పరచి డబ్బులు నగలు అందులో వేయమని బెదిరిస్తే వాళ్ళు తాళిబొట్లు కూడా తీసి వేశారట! వెంటనే తాళి బొట్లు తిరిగి ఇచ్చేసాడని అప్పట్లో వెంకట సుబ్బయ్య గారే స్వయంగా చెప్పినట్లు సమాచారం!

దొంగతనం చేసే ముందు ఆ ఊరు చేరుకుని రెక్కి నిర్వహిస్తారు! ఏదొక పేద కుటుంబాన్ని ఎంపిక చేసుకుని వారికి డబ్బులు అదనంగా ఇచ్చి అతిధ్యం బస ఏర్పాటు చేసుకుంటారు! చక్కగా అనుకున్నట్లుగా ఆ ఊర్లో బలిసిన మోతుబరి ఇంటికి కన్నం వేసి దోచుకుని వెళతారు! ఇది టైగర్ టెక్నీక్! మొదట వరి చేలల్లో వడ్లు దొంగిలించే వాళ్ళు! పాన్ షాపులు పగులగొట్టి తిను బండారాలు తెచ్చుకునే వాళ్ళు! బతకడం కోసం ఆరంభించి చివరకు అవసరం వున్న వారికి సాయం చేసే స్థాయికి చేరుకున్నాడు! ఊర్లో ఉంటే పోలీసులు తాకిడి! అందుకే ఓడరేవుకు వెళ్లే దారిలో వి ఆర్ ఎస్ కాలేజ్ దగ్గర లో వున్న గుడిసెల్లో ఉండేవాడు! రోజుకో చోట తల దాచుకునే వాడు! ఆ కాలేజ్ గ్రౌండ్ కు వచ్చే పేద పిల్లలకు ఖర్చులకు డబ్బులిచ్చే వాడు! ఎవరైనా పేద కుటుంబాల్లో పెళ్ళి ఉందని తెలిస్తే తాళి బొట్టు పసుపు కుంకుమ పేరిట కాస్త డబ్బు ఇచ్చి పంపుతాడు! అంతే కానీ, తలకు మించి సంపాదించింది లేదు, ధారాళంగా సాయం చేసింది లేదు! ఎవరికి ఏ కష్టం వచ్చి తనకు చెప్పుకుంటే వారిని ఆదుకునేందుకు దొంగతనం ప్లాన్ చేసేవాడు! ఆయన ఇల్లు కూడా తాటాకుల గుడిసె! మేనమామ కుమార్తె మణెమ్మ నే పెళ్ళి చేసుకున్నాడు! అబ్బాయి అమ్మాయి ట్విన్స్ పుట్టారు! అబ్బాయి పిజి చదివాడు కానీ, ఉద్యోగం లేక ప్రస్తుతం దేవదాసు గా మారిపోయాడు! అమ్మాయి మానసిక వైకల్యం తో కొన్నేళ్ల క్రితం చనిపోయింది! భార్య మణెమ్మ రెండేళ్ల క్రితం అనారోగ్యం తో కనుమూసింది! ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే… టైగర్ దొంగతనాలతో కుటుంబానికి ఒరిగింది ఏమీ లేదు అని!

నాగేశ్వరరావు తన జేబులో ఎప్పుడూ 20 వేల రూపాయలు ఉంచుకునే వాడు! అరెస్ట్ చేస్తే బెయిల్ కోసం ఆ డబ్బు! న్యాయ శాస్త్రం పుస్తకాలు కొని మరీ దొంగతనానికి సంబంధించిన పలు సెక్షన్లు తెలుసుకునే వాడు! ఐదుగురు కన్నా ఎక్కువ మందితో కలసి దొంగతనం చేస్తే, పట్టుబడితే శిక్షా కాలం ఎక్కువ! అందుకే తన బృందం లో ఎప్పుడూ నలుగురే ఉండేవారు! సినిమాల్లో చూపించినట్లు దొంగతనాలకు ఏరియా వేలం పాటలు ఏమీ లేవు! ఒకసారి మాత్రం గూడ్స్ బండి ని స్టువర్ట్ పురం లోనే ఆపి బియ్యం బస్తాలు దొంగిలించారు! రైళ్ళల్లో ప్రయాణిస్తూ నిద్రపోతున్న వారి సూట్ కేసులు దొంగిలించి చైన్ లాగి ఎక్కడో దిగిపోయేవారు! బేతంపూడి శేషమ్మ ఆయన ప్రియురాలు! వాళ్ళు తల దాచుకుంటున్న చోటకే వచ్చి అన్నం వండి పెడుతుండేది! కారంచేడు రైల్వే గేటు బ్రిడ్జ్ పక్కనే ఆమె ఇల్లు! ఎక్కువగా అక్కడే ఉండే వాడు టైగర్! సహజంగా స్టువర్ట్ పురానికి చెందిన చిన్న చిన్న దొంగలు చీరాల పోలీసులకు ఇన్ఫార్మర్స్ గా మారారు! ఎవరు ఇంట్లో నాలుగు రోజులు కనిపించక పొతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం వీరి పని! ఇందులో వలాది బాబు ఒకడు! వాడి కాలు తీసేసాడు ఒక తప్పులో! అప్పటి నుంచి టైగర్ పై పగ పెంచుకున్నాడు అతను! అతనే పోలీసులకు పట్టించే వాడు పలు మార్లు! టైగర్ జేబులో ఒక పిస్టల్, ఒక బాంబు ఎప్పుడూ వుండేదట! ఒకసారి చీరాల జైలు నుంచి తప్పించుకుంటే పోలీసులు వెంబడించారట! పోలీసు కుక్క వెంటాడిందట! అప్పుడు జేబులో వున్న బాంబును కుక్క పై విసరడం తో కుక్క మూతి పగిలిందట! ఆ కుక్క మరో ఆరేళ్ళు విజయవాడ లో పోలీసుల దగ్గర ఉండటం తో చాలా మంది టైగర్ తో గాయపడిన డాగ్ అంటూ చూసేవాళ్ళు అట!

చీరాల ఎస్ఐ మురళి తో అద్దంకి పొగాకు బ్యారన్ లో జరిగిన గొడవ లో మహిళల ముందు అతడ్ని కొట్టడం తో టైగర్ పై కోపం పెంచుకున్నాడు! ఇందిరాగాంధీ ప్రధానిగా చీరాల పర్యటించినప్పుడు అప్పటి ఎంపి బెంజిమెన్, సంస్కార్ నిర్వాహకురాలు హేమలత లవణం తదితరులు కలసి స్టువర్ట్ పురం సమస్య వివరించినప్పుడు అక్కడే వున్న విజయవాడ డిఐజి ని పిలిచి టైగర్ గురించి తెలుసుకోవడం, అతన్ని సజీవంగా పట్టుకుని తన దగ్గరకు తీసుకు రావాలని ఆదేశాలు జారీ చేసినట్లు అప్పట్లో ఎస్ఐ గా వున్న చక్రపాణి గారు చెప్పిన సమాచారం! అదునుకోసం చూస్తున్న మురళికి సమయం కలసి వచ్చింది! 1980 మార్చి 23 అర్ధరాత్రి శేషమ్మ ఇంట్లో వున్నాడని తెలుసుకుని వలాది బాబు ద్వారా శేషమ్మ కు డబ్బు ఆశ కల్పించి పాలల్లో మత్తు మందు కలిపి టైగర్ తో తాగించేలా చేశారు! మత్తులోకి వెళ్ళాక టప టప రెండు రౌండ్లు కాల్పులు జరిపారట! ఆ తరువాత పై అధికారులకు సమాచారం ఇవ్వడం, శేషమ్మ ఇంట్లో వున్న టైగర్ ను జీపు లో వేసుకుని ఓడరేవు కు తీసుకెళ్లి ఎన్ కౌంటర్ చేసేశారు! ఆ తరువాత వుడ్ నగర్ లో వున్న ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చి పోస్టు మార్టం అయ్యాక స్టువర్ట్ పురం కు సమాచారం అందించారు! అలా ఆ వార్త దావానలం లా పాకింది! విపరీతంగా అభిమానులు వచ్చి అంతిమ యాత్ర లో పాల్గొన్నారు! పది వేల మందికి పైగా దాదాపు 12 గంటల పాటు ఊరేగింపు సాగడం అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది! ఒక గజ దొంగ కు ఇంతమంది అభిమానులా అంటూ మంచి దొంగ అంటూ నీరాజనం పలికి టైగర్ ను టైగర్ లా సాగనంపారు! ఇది టైగర్ చరిత్ర! ఎన్నటికీ చెదరని చరిత్ర! దొంగల్లోను మంచి దొంగలు ఉంటారని చాటి చెప్పిన మహా చరిత్ర! చనిపోయే నాటికి టైగర్ వయసు కేవలం 27 ఏళ్ళు! టైగర్ అన్న ప్రభాకర్ ప్రస్తుతం పక్షవాతం తో బాధ పడుతూ విజయవాడ లో ఒక వృద్ధాశ్రమం లో వుంటున్నారు. ఆయన వయసు 73 ఏళ్ళు!

  • డా. మహ్మద్ రఫీ
- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article