కొమురవెల్లి: ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటైన సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు(జాతర) ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏటా సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో జాతర మొదలై మూడు నెలలపాటు కొనసాగుతుంది. ఉగాదికి ముందు వచ్చే ఆదివారం అర్ధరాత్రి నిర్వహించే అగ్నిగుండాల కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయి. ‘పట్నం వారం’గా పిలిచే జాతరలోని మొదటి ఆదివారం రోజున హైదరాబాద్ నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. సోమవారం వారు సొంతంగా ‘పట్నం- అగ్నిగుండం’ నిర్వహిస్తారు. ఆదివారం ఆలయానికి విచ్చేసిన భక్తులు మట్టిపాత్రల్లో నైవేద్యం వండి, అలంకరించి, నెత్తిన పెట్టుకొని పూనకాలతో స్వామికి, కొండపై ఉన్న మల్లన్న తోబుట్టువు రేణుకాఎల్లమ్మకు బోనం సమర్పించారు. ఆదివారం సుమారు 60వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారని కార్యనిర్వహణాధికారి బాలాజీ, పాలక మండలి ఛైర్మన్ గీస భిక్షపతి తెలిపారు.