ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ మళ్ళీ పురస్కారాలు!
- By డా.మహమ్మద్ రఫీ
తెలంగాణ వచ్చాక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ తొమ్మిదేళ్లలో ఒక్కసారి అవార్డు గ్రహీతలను పరిశీలిస్తే ఏమనిపిస్తుంది? ఎప్పుడు వీళ్లేనా అని ఆశ్చర్యం కలుగుతుంది! ఉమ్మడిగా వున్నప్పుడు అవార్డులు అందుకున్న వాళ్లే అందరూ! తెలుగు రాష్ట్రాలుగా విడి పోయాక మళ్ళీ వాళ్లే అందుకుంటున్నారు! పురస్కార గ్రహీతలను తప్పు పట్టడం లేదు! ఎంపిక చేసేందుకు ఒక కమిటీ ని నియమిస్తుంది ఆ ప్రభుత్వం అయినా, ఈ ప్రభుత్వం అయినా! ఆ కమిటీ వాళ్ళకు బుర్ర ఉంటుంది కానీ, ఆలోచన చేయరు అనిపిస్తుంది! ఎందుకంటే ప్రతి యేటా కమిటీ మారుతూ ఉంటుంది! ఎంపిక షరా మామూలే! రెండేళ్ల క్రితం అందుకున్న వాళ్ళో, ఇప్పటికే పలు మార్లు ప్రభుత్వ పురస్కారాలు స్వీకరించిన వారే లిస్ట్ లో కనిపిస్తుంటారు!
ఆశ్చర్యం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక పద్మ పురస్కారం అందుకున్న వాళ్ళను సైతం రాష్ట్ర ప్రభుత్వ కమిటీ ఈ రాష్ట్ర అవార్డ్స్ లో చేరుస్తుంది! అంటే ఒక మెట్టు కిందకు దించడం అన్నమాట! పద్మ అవార్డు విలువ ను దిగజార్చడం అన్నమాట! రాష్ట్రం లో కీలక పురస్కారాలు అందుకున్న వారికి పద్మ లభించేది ఒకప్పుడు! ఇప్పుడంతా తారుమారు! వడ్డించే వాడ్ని బట్టి అదృష్టం ఆధారపడి వుంటుంది.
కమిటీ కి తెలియక పోవచ్చు! వచ్చిన దరఖాస్తుల్లోంచి బెస్ట్ అని ఎంపిక చేసి ఉండొచ్చు! ఇలా ఎంపిక సమయం లో సమాచార శాఖ లేదా సాంస్కృతిక శాఖ గతం లో అవార్డులు అందుకున్న వారి జాబితా కమిటీ ముందు పెట్టాల్సి ఉంటుంది! కానీ, ఆ నిబంధనలు పట్టించుకునే పరిస్థితి ఇక్కడ అక్కడ ఎక్కడ లేదనుకోండి!
ఇలా అయితే తరువాత వారి పరిస్థితి ఏమిటి? ఆ రాష్ట్రం లో అయినా ఇక్కడ అయినా ఆ రెండు మూడు వందల మందిలోంచి ఎంపిక చేస్తుండటమేనా? ఇక ప్రతిభ గలిగిన వారు లేరా? గతం లో కలసి వున్నప్పుడే నయం అనిపిస్తుంది! విడిపోయాక మళ్ళీ శిఖరం లో కూర్చుని అవార్డుల్లో మునిగి తేలుతున్న వారికే మళ్ళీ అవకాశం! ఏ అవార్డులు లేకుండా ఆయా రంగాల్లో ఎంతో కృషి చేసి శిఖరం పై కూర్చుని దిక్కులు చూస్తున్న వాళ్ళు లక్షల్లో ఉన్నారు! ప్రభుత్వాల ఆలోచనలు మారాలి! కొత్త ప్రతిభ ను ప్రోత్సాహించాలి! ప్రభుత్వాలు మారినప్పుడల్లా మన ప్రభుత్వం ఇవ్వలేదంటూ ఇలా ఇచ్చిన వాళ్ళకే ఇచ్చుకుంటూ వెళ్లే సంప్రదాయానికి స్వస్తి పలకాలి.